Friday 10 October 2014

నోబెల్ శాంతి బహుమతి 2014

నోబెల్ శాంతి బహుమతి
         
         నోబెల్ శాంతి బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబుల్ పేరిట 1901లో ప్రారంభించారు. ఐదు నోబెల్ బహుమతుల్లో నాలుగింటిని స్వీడిష్ కమిటీలు ఇస్తుండగా, శాంతి బహుమతిని మాత్రం నార్వేజియన్ కమిటీ అందజేస్తుంది. ఆల్ఫ్రెడ్ నోబుల్ వీలునామా ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. దానికి కారణం నోబెల్ ఎక్కడా వివరించలేదు. నోబెల్ వర్ధంతి రోజున అంటే డిసెంబర్ 10న లండన్ లో శాంతి బహుమతి అందజేస్తారు.

1901 నుంచి 2014 వరకు 128 మందికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి బహుమతి గ్రహీతల్లో 16 మంది మాత్రమే మహిళలు వుండడం విశేషం. రెండు సార్లు నోబెల్ బహుమతిని ముగ్గురేసి పంచుకున్నారు. లెడ్యూతో అనే విజేత నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించారు. ముగ్గురు నోబెల్ ప్రైజ్ విజేతలు బహుమతి ప్రకటించిన సమయంలో జైలులో ఉన్నారు.

          2014 వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్ధికి రావడంతో గతంలో ఎంత మంది భారతీయులు నోబెల్ సాధించారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోబెల్ పురస్కారం గెలుచుకున్న భారతీయుల వివరాలు:

1.       1913లో రవీంద్రనాథ్ టాగోర్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్నారు.
2.       1930లో సర్ సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నారు.
3.       1968లో హర్ గోవింద్ ఖొరానా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పుచ్చుకున్నారు.
4.       1979లో మదర్ థెరెస్సా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
5.       1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వచ్చింది.
6.       1998లో అర్థశాస్త్రంలో అమర్త్యసేన్ ను నోబెల్ బహుమతి వరించింది.
7.       2014లో శాంతి బహుమతి కైలాష్ సత్యార్థి అందుకోనున్నారు.

వీరు మాత్రమే కాకుండా భారత్ తరపున కానప్పటికీ నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు ఉన్నారు.

1)      భారత్ లో పుట్టిన బ్రిటిష్ పౌరులు రోనాల్డ్ రాస్. రుడ్ యార్డ్ కిప్లింగ్,
2)      భారత్ లో పుట్టి ఇతరదేశాల్లో స్థిరపడిన వెంకట్రామన్ రామకృష్ణన్ కు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
3)      ట్రినిడాడ్ లో పుట్టి బ్రిటన్ లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తి వీఎస్ నైపాల్ కు,
4)      భారత్ లో పుట్టిన పాకిస్థాన్ పౌరుడు అబ్దున్ సలాంకు నోబెల్ పురస్కారం దక్కింది.
5)      టిబెట్ లో పుట్టి భారత్ లో నివసిస్తున్న దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
6)      భారత్ లో పుట్టిన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనన్ కు నోబెల్ ప్రైజ్ దక్కింది.
7)      ఐపీసీసీ పేరిట భారతీయుడు రాజేంద్ర కుమార్ పచౌరీ నిర్వహిస్తున్న ఛారీటీ సంస్థ కూడా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది.



          2014 లో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి ఎంపికైన భారతీయుడు కైలాశ్ సత్యార్థి ఎవరు? ఆయనకు నోబుల్ శాంతి బహుమతి ఎలా వచ్చింది? ఈ వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్థి ఓ సామాజిక ఉద్యమకారుడు, సేవా తత్పరత మెండుగా ఉన్న వ్యక్తి. 'బచ్ పన్ బచావో ఆందోళన్' సంస్థను స్థాపించి బాలల హక్కుల కోసం విశేష కృషి చేశారు. మురికివాడల బాలల కోసం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తీవ్ర పోరాటాలు చేశారు కైలాశ్ సత్యార్థి.

          మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఈయన, న్యూఢిల్లీలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. సత్యార్థి సేవలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కానప్పటికీ, ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. కైలాశ్ సత్యార్ధి తన పోరాటాల ఫలితంగా 80 వేల మంది బాలలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.

'బచ్ ‑పన్ బాచావో ఆందోళన్' సంస్థ ద్వారా అనాథ బాలలకు పునరావాసం, విద్య అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలల హక్కుల కోసం చేసిన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు ఆయన కీర్తికిరీటంలో ఒదిగిపోయాయి.

          నోబెల్ బహుమతి లభించడం తనను ఆనందానికి గురి చేసిందని విదిష ప్రాంతానికి చెందిన కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. నొబెల్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నోబెల్ బహుమతి ప్రకటించడం ద్వారా కోట్లాది మంది బాలల గొంతు ప్రపంచం విందని అర్థమైందని అన్నారు. రెండున్నర దశాబ్ధాలుగా బాలల హక్కులకు కృషి చేస్తున్నందుకు తనకు గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు.

          గాంధేయవాదంతో శాంతియుత ఆందోళనల ద్వారా బాలల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా నోబెల్ కమిటీ ఆయనను కీర్తించింది. భారత్, పాకిస్థాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మలాలాతో కలసి పని చేస్తానని సత్యార్థి ప్రకటించారు. రెండు దేశాల్లోని బాలల హక్కుల కోసం కలిసి పనిచేద్దామని మలాలాలను అడుగుతానని ఆయన తెలిపారు. మలాలా తనకు వ్యక్తిగతంగా తెలుసని, రెండు దేశాల్లో బాలల హక్కులు, ముఖ్యంగా బాలికల విద్య కోసం కలసి పోరాటం చేద్దామని మలాలాను పిలుస్తానని ఆయన వెల్లడించారు. రెండు దేశాల్లో శాంతి నెలకొనడం బాలల భవిష్యత్ కు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

           నోబెల్ శాంతి బహుమతి 2014 ను అందుకోబోతున్న మరొక సంస్కర్త శ్రీ మలాలా యూసెఫ్ జాయ్, పాకిస్థాన్, తనకు లభించిన ఈ బహుమతి బాలికలకు విద్యపై అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుందని మలాలా యూసెఫ్ జాయ్ పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని తెలిసిన ఆమె మాట్లాడుతూ, అవార్డు అల్లా ఆశీర్వాదమని అన్నారు. మలాలా కుటుంబం మొత్తం ఆనందాశ్చర్యాల్లో ఉన్నారని మలాలా సోదరుడు తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహమిస్తుందని వారు పేర్కొన్నారు.

No comments:

Post a Comment